రాజ‌ధాని రంగుల క‌ల ప‌రుచుకుంది. విస్తృతంగా జ‌నాల్లోకి వెళుతోంది. ప్ర‌చారాన్నే న‌మ్ముకుని ప‌బ్బం గ‌డుపుకుంటున్న స‌ర్కారు హ‌యంలో అది అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా సాగుతోంది. అమ‌రావ‌తిలో అద్బుతంగా జ‌ర‌గ‌బోతోంద‌న్నట్టుగా అంద‌రినీ న‌మ్మించే ప్ర‌య‌త్నం సాగుతోంది. అయితే అస‌లు వాస్త‌వాలు మాత్రం ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేదు. ప్యాకేజీల‌కు అల‌వాటు ప‌డిన పెయిడ్ మీడియా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేసి ప్ర‌భుత్వ గొంతులో పెద్ద మాయ సాగిస్తోంది. అంద‌రినీ మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తోంది. అందుకే పాపం రాజ‌ధాని ప్రాంత వాసుల స‌మ‌స్య‌లు బ‌య‌ట ప్ర‌పంచానికి అస‌లు తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. నిజంగా అనుభ‌వ‌జ్ఞుడ‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు సార‌ధ్యం అందుకు చ‌క్క‌గా ఉప‌యోగప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రాజధాని ప‌రిధిలోని మొత్తం 29 గ్రామాల్లో భూములున్న ధనిక రైతులు కొందరు భూముల రేట్లు పెరిగి సంతోషిస్తున్నారు. కానీ, వేలాది మంది వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు, ఇతర శ్రామికుల ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఉపాధి కోసం వారు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. సంవత్సరం పొడవునా ఉపాధి హామీ పనులు చూపిస్తామని ఇచ్చిన హామీలు కాగితాల్లోనే మిగిలిపోయాయి. 53 వేల మంది వ్యవసాయ కార్మికులు ఉండగా ఈ ఆరు నెలల్లో కేవలం 551 మందికి మాత్రమే పని చూపించారంటే స‌ర్కారీ ఉపాధి ఎంత చ‌క్కంగా ఉందో అర్థ‌మ‌వుతుంది. అయినా ఒక్క‌రు కూడా ఈ అర‌ల‌క్ష‌మంది జ‌నాల స‌మ‌స్య‌ల‌ను వినిపించిన‌, చూపించిన దాఖ‌లాలు లేవంటే ప్ర‌చార హోరు అస‌లు సంగ‌తి ఇట‌ట్ఏ అర్థ‌మ‌వుతుంది. సగటున ఎనిమిది రోజులు మాత్రమే ఉపాధినిచ్చి, ఊరంతా సంతోషంగా ఉన్నారంటూ చీరా, ధోవ‌తి పంచుతున్న స‌ర్కారును ప్ర‌శ్నించ‌డానికి సిద్ధంగాని తెలుగు మీడియా వాస్త‌వాలు మ‌రుగున‌ప‌ర‌చ‌డానికి ఎంత చ‌క్కంగా ప్ర‌య‌త్నిస్తుందో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. నాసిర‌కం ధోవ‌తులు మాకొద్దు అంటూ వెన‌క్కి తిరిగి ఇచ్చేసిన రైతుల గొంతు వినిపించ‌కుండా అడ్డుకోవ‌డం చూస్తే ఎంత చ‌క్క‌గా ప‌నిచేశారో చెబుతోంది.

CR1GfcJVAAABKYS
మరోవైపు భూమిలేని పేదలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్‌ పంపిణీ పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారింది. ఆగస్టు నెలలో 29 వేల మంది లబ్ధిదారులను గుర్తించి అక్టోబర్‌ నాటికి 14 వేలకు కుదించారు. అందులో పంపిణీ ఎంత‌మందికి జ‌రిగిందంటే మాత్రం పంచ‌పాడ‌వులు..మంచం కోళ్ల సామెత‌ను త‌ల‌పిస్తోంది. కందిప‌ప్పు ధ‌ర 210 రూపాయాల‌కు పెంచిన రోజుల్లో ఒక్కో కుటుంబం 2,500 రూపాయలతోనే బ‌తికేయండని చెబుతున్న స‌ర్కారు దాన్ని కూడా అర‌కొర‌పంపిణీతో సరిపెడుతోంది. ఇక ఇంటింటికీ ఉద్యోగం అన్న పెద పాలేరు గారి పాల‌న‌లో రాజ‌ధాని ప్రాంత యువ‌త 22 వేల మందికి ఉపాధి శిక్షణ ఇస్తామని నమ్మబలికి ఇప్పటికి 250 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారంటే వాస్త‌వాలు ఎంత చేదుగా ఉన్నాయో తెలుస్తుంది. ప్ర‌భుత్వం సీఆర్డీఏ చ‌ట్టం పేరుతో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల సంగ‌తే ఈ రీతిలో అమ‌ల‌వుతుంది. ఇక రైతుల‌కు ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేని ఒట్టి హామీల మీద అన్నీ అప్ప‌గించేసి చూస్తున్న వారి మాటేంటి అంటే స‌మాధాన‌మే ఉండుదు.

ఇప్పుడే ఈ గతి పడితే రాబోయే పదేళ్ళల్లో వీటి అమలుపై అందరిలోనూ అనుమానాలు నెలకొని ఉన్నాయి. పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఇంటింటికీ వెళ్ళి చీరా, సారె ఇచ్చి శంకుస్థాపనకు ఆహ్వానం పలుకుతూ శిలాఫలకంలో పేర్లు కూడా పెడతామని ఊరిస్తున్న ప్రభుత్వం ఆ రైతులకు ప్యాకేజీ ప్రకారం భూమి ప్రత్యామ్నాయంగా ఎక్కడిస్తారో ఇంతవరకు తేల్చలేదు. అసలు భూమి ఇస్తారా, లేదా? నిర్మాణం అయిన కట్టడాలలో కొంత వాటా ఇస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. భూమి ఎప్పుడిస్తారు? ఎక్కడిస్తారు? ఈ భూమిలో మౌలిక సదుపాయాలు ఎవరు కల్పిస్తారు? ఎప్పుడు కల్పిస్తారు? అభివృద్ధి పనులు ఎప్పుడు జరుగుతాయి? ఎన్ని సంవత్సరాలకు ఈ భూమి విలువ పెరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కరువవుతున్నాయి. మరోవైపు రోడ్ల వెడల్పు, మెట్రో ఏర్పాటు, మంచినీరు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్‌ లైన్లు మరెన్నో సౌకర్యాల పేరుతో ఏ ఇల్లు ఎంత వరకు ఉంటుందో, పోతుందో అనే భయాందోళనలు జనంలో ఉన్నాయి. సీడ్‌ క్యాపిటల్‌లో గ్రామాలు, నివాసాలు ఉంటాయా? పూర్తిగా తరలిస్తారా? పొమ్మనకుండా పొగబెడతారా? ఇవి ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, ఇతర పౌర సదుపాయాల కల్పనను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టి భారీగా పన్నులు విధిస్తారన్న భయాందోళనలు వెంటాడుతున్నాయి. భూములు ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గ్రామాల్లో బలవంతపు భూ సేకరణకు ప్రయత్నించి ప్రజా ప్రతిఘటనతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. శంకుస్థాపన అనంతరం ఏదో ఒక రూపంలో భూ సేకరణకు ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నిస్తుందనే అనుమానాలు రైతాంగంలో బలంగా ఉన్నాయి.

మట్టి-నీరు, రైతు వందనం, ప్రజల భాగస్వామ్యం అంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లపై ప్రజల అభిప్రాయాలను సేకరించ లేదు. కనీసం ఎన్నికయిన స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయలేదు. రాజధాని సలహా కమిటీ బడా పారిశ్రామిక వేత్తలతో నింపి వేసింది. జన్మభూమి కమిటీలను తెలుగు దేశం పార్టీ కమిటీలుగా మార్చేశారు. రాజధాని నగరంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పేరుతో ప్రజల గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటి వరకు పై నుంచి క్రింది వరకు ఏ స్థాయిలోనూ రాజధాని అంశంపై ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా ప్రభుత్వం నిర్వహించలేదు.

ఇన్ని వాస్త‌వాల‌ను మ‌రుగున ప‌రిచి, నిజాల‌ను పాత‌రేసి అటు కేంధ్రాన్ని, ఇటు ఓట్లేసిన జ‌నాన్ని ఒకేసారి మోసం చేసే ప్ర‌క్రియ సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంధ్రం త‌న అనుమానాల‌ను బ‌య‌ట‌పెట్ట‌గా..ప్ర‌జ‌ల సందేహాల‌కు మన ప్ర‌జాస్వామ్య మీడియాలో అవ‌కాశం ద‌క్క‌డం లేదు. కార్పోరేట్ నాయ‌కుని పాల‌న‌లో మీడియా కార్పోరేట్ కు అనుగ‌ణంగా సాగుతోంద‌న‌డానికి ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. క‌ర్ష‌కుడి క‌ష్టాన్ని కాజేసి కార్పోరేట్ కు క‌ట్ట‌బెట్ట‌డానికి సాగుతున్న పెద్ద తంతులో కెమెరా క‌ళ్లు, ప‌త్రికా క‌లాలు కూడా క‌ష్ట‌ప‌డేటోనికి వ్య‌తిరేకంగా సాగుతున్న తీరు దానికి అద్దంప‌డుతుంది.